కెన్నెడీ హై ద గ్లోబల్ స్కూల్ నందు కాళోజి నారాయణరావు గారు జయంతిని పురస్కరించు కొని సెప్టెంబర్ 9 వ తారీఖున తెలంగాణ రాష్ట్ర భాషా దినోత్సవ వేడుకలు వైభవోపేతంగా జరిగాయి. ఈ సందర్భంగా స్కూల్ ప్రాంగణాన్ని మామిడి తోరణాలతో, అరటి పిలకలతో బంతి పూలతో, రంగవల్లులతో బహు సుందరంగా అలంకరించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కెన్నెడీ హై ద గ్లోబల్ స్కూల్ ప్రెసిడెంట్ సర్ బి.సుబ్బారెడ్డి గారు, మేనేజింగ్ డైరెక్టర్, కమాండర్ N. కృపాకర్ రెడ్డి గారు, అకాడమిక్ డైరెక్టర్ & సీనియర్ ప్రిన్సిపల్ రాజ్యలక్ష్మీ భట్ మేడమ్ గారు వేంచేశారు.
ఈ సందర్భంగా కెన్నెడీ హై ద గ్లోబల్ స్కూల్ ప్రెసిడెంట్ సర్ బి. సుబ్బారెడ్డి గారు ప్రసంగిస్తూ కాళోజి నారాయణరావు గారు తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిపోయిన ప్రజాకవి అనీ, కాళోజి పాటలలో, మాటలలో, చేతలలో, ఆలోచనలలో, ఆవేదనలో వేష భాషలలో తెలంగాణ స్వరూపం సంపూర్ణంగా కనిపిస్తుందన్నారు. తెలంగాణ ఆధునిక సాహిత్యానికి ముఖ ద్వారం వంటి వారని వివరించారు. అంతే కాకుండా భారతదేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ పొందారని విద్యార్థులకు తెలియపరిచారు. తరువాత మేనేజింగ్ డైరెక్టర్, కమాండర్ N. కృపాకర్ రెడ్డి గారు ప్రసంగిస్తూ తెలుగు భాష ప్రాచీనమైనదే కాదు సుసంపన్నమైన సాహిత్యం కలిగి నటువంటి భాష అని, విద్యార్థులు స్పష్టంగా చదవడం, వ్రాయడం నేర్చుకోవాలని, మంచి పుస్తకాలు చదవడం వలన నైతిక విలువలతో పాటు మానవత్వపు లక్షణాలు అలవడి ఉత్తమ పౌరులుగా ఎదుగుతారు అన్నారు అని స్పష్టం చేశారు.
అనంతరం అకాడమిక్ డైరెక్టర్, సీనియర్ ప్రిన్సిపల్ రాజ్యలక్ష్మీ భట్ మేడమ్ గారు మాట్లాడుతూ తేనెలూరే భాష మన తెలుగు భాషనీ, తెలంగాణ యాస సంస్కృతానికి దగ్గరగా ఉండే భాషనీ, ఎన్ని భాషలు నేర్చినా మాతృ భాషలోని పలకరింపు మన మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తుందన్నారు. తెలుగు భాష అంటేనే ఎన్నో యాసల సమాహారం అనీ, నేటి బాలలే రేపటి పౌరులుగా ఎన్ని భాషలు నేర్చినా ఉన్నత శిఖరాలను అధిష్టించినా మన మాతృభాషను చులకన చేయవద్దని విద్యార్థులకు వివరించారు.
తదనంతరం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపురులను ఆకట్టుకున్నాయి. "భువన విజయం" అనే నాటికను ప్రదర్శించి రాయల కాలం నాటి వైభవాన్ని కళ్ళకు కట్టినట్లు ప్రదర్శించారు.